Sunday, May 03, 2009

Annamayya Keerthanalu (అన్నమయ్య కీర్తనలు) - Jo achutananda (జో అచ్యుతానంద)

జో అచ్యుతానంద జో జో ముకుందా
రావే పరమానంద రామ గోవిందా

అంగజుని గన్న మాయన్న ఇటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసీ రారా
దొంగ నీవని సతులు పొంగుచున్నారా
ముంగిట నాడర మోహనాకారా

నందు నింటను జేరి నయము మీరంగ
చందవదనలు నీకు సేవ చేయంగ
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ

పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు

అంగుగా తాళ్ళపాకన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదల నీ వేళ
మంగళము తిరుపట్ల మదన గోపాల

Saturday, May 02, 2009

Tyagaraja Keerthanalu (త్యాగరాజ కీర్తనలు) -- Nagumomu ganaleni (నగుమోము గనలేని)

నగుమోము గనలేని - నా జాలి తెలిసి
నను బ్రోవ రారాదా!
శ్రీ రఘువర నీ || నగమోము ||

నగరాజ ధర - నీదు పరివారమెల్ల
ఒగి బోధన చేసే వారలు గానే
యటు లుండదురా! నీ || నగమోము ||

ఖగరాజు నీ ఆనతి విని వేగ చనలేదో
జగమేలే పరమాత్మా - ఎవరితో మొరలిడుదు
వగజూపకు! తాళను - నన్నేలుకోరా!
త్యాగరాజనుత - నీ || నగమోము ||