Wednesday, September 27, 2006

Tyagaraja Pancharatna Keerthanalu: Endaro Mahaanubhaavulu -- ఎందరో మహానుభావులు

Please find an updated version of this at: http://www.vignanam.org/veda/tyagaraja-pancharatna-keerthanas-endaro-mahanubhavulu-telugu.html

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: శ్రీ
తాళం: ఆది

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమున
జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు

సామగాన లోల మనసిజ లావణ్య
ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు

మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే
వారెందరో మహానుభావులు

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము
సేయువారెందరో మహానుభావులు

పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును
సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు
వారెందరో మహానుభావులు

హరిగుణ మణిమయ సరములు గళమున
షోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే
బ్రోచువారెందరో మహానుభావులు

హొయలు మీర నడలు గల్గ్గు సరసుని
సదా కనుల జూచుచును పులక శరీరులై
ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము
గలవారెందరో మహానుభావులు

పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము
సదానుభవులు గాక ఎందరో మహానుభావులు

నీ మేను నామ వైభవంబులను
నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను
వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను
దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి
సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు
వారెందరో మహానుభావులు

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను
శివాది సన్మతముల గూఢములన్
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి
నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన
వారెందరో మహానుభావులు

ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజనుతుని
నిజ దాసులైనన వారెందరో మహానుభావులు
అందరికీ వందనము-లెందరో మహానుభావులు

Friday, September 01, 2006

Bhakta Ramadasu Keerthanalu: Paluke bangaramaayenaa -- పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయెనా, కోదండపాణి పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ

ఎంత వేడినగాని సుంతైన దయరాదు
పంతము సేయ నేనెంతటివాడను తండ్రీ

ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రీ

రాతి నాతిగ చేసి భూ తలమున
ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రీ

శరణాగతత్రాణ బిరుదాంకితుడవుకాదా
కరుణించు భద్రాచల వరరామదాస పోష

Bhakta Ramadasu Keerthanalu: Ee teeruga nanu daya choochedavo -- ఏ తీరుగ నను దయ చూచెదవో

ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇన వంశోత్తమ రామా..
నా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా

శ్రీ రఘు నందన సీతా రమణా, శ్రితజన పోషక రామా..
కారుణ్యాలయ భక్త వరద నిను, కన్నది కానుపు రామా

క్రూరకర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామా..
దారిద్ర్యము పరిహారము సేయవే, దైవ శిఖామణి రామా

వాసవ నుత రామదాస పోషక వందన మయోధ్య రామా..
భాసుర వర సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా